ఈ ఆధునిక కాలంలో ఇపుడంతా ఇంటర్నెట్, సెల్ వినియోగం ఎక్కువైపోయింది. ప్రేమను వ్యక్తీకరించాలన్నా... ప్రేమ భావనలు తెలుపాలన్నా.. ఇ- మెయిల్ లేదా సెల్ సాధనంగా మారిపోయింది. నిజానికి హృదయంలో రేగే ప్రేమ భావనలను ఓ లేఖపై అద్ది ప్రియురాలు/ ప్రియునికి అందజేస్తే ఆ అనుభూతి ఎన్నటికీ మరువలేనిదిగా మిగిలిపోతుందంటున్నారు ప్రేమ జీవులు.
ఆనాటి కాలంలో ప్రేమలేఖలు గురించి ఎన్నో సినిమాలు, కథలు, నవలలు వచ్చాయి... కానీ నేటి కాలంలో అసలు ప్రేమలేఖలకే స్థానం లేకుండా పోయిందనే చెప్పవచ్చు. ప్రేమలేఖలా...? అవెలా ఉంటాయి..? ఎలా రాయాలి..? అని అడిగేవారూ ఎక్కువయ్యారు. అటువంటి వారికోసం కొన్ని చిట్కాలు....
ప్రేమలేఖను రాయాలనుకున్నవారు ఇలా చేయాలి. మనసులో మీ ప్రేమమూర్తిని తలుచుకుంటూ కళ్లు మూసుకోండి. సుదీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీ ప్రియురాలు/ప్రియుడి రూపాన్ని మనసులో ఆవిష్కృతం చేసుకోండి. మీరు తొలిసారిగా మీ లవర్‌ను ఎక్కడ కలుసుకున్నారో మననం చేసుకోండి.
ఆమె/అతని శరీర స్పర్శ రుచి చూసిన క్షణాలు, అది కలిగించిన హాయిని నెమరేసుకోండి. మీరు కలిసి తిరిగిన ప్రదేశాలు, సంతోషం కలిగించిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకోండి. వీటన్నిటిలో మీ లవర్‌తో అత్యంత ఆనందాన్ని కలిగించిన సంఘట ఏదో దానితో ప్రేమలేఖలోని తొలి వాక్యాన్ని ప్రారంభించండి.
ఈ తొలివాక్యం... ఆమె/అతని హృదయ కవాటాలను తాకి మీదైన ప్రేమలోకంలో విహరించేటట్టు చేయాలి. మీతోటిదే లోకంగా మారిపోవాలి. ఆ ప్రేమలేఖ మీ ప్రేమబంధాన్ని మరింత దృఢం చేసేదిగా ఉండాలి. అన్నట్లు ప్రేమలేఖ రాసేటప్పుడు మీ ప్రియుడు లేదా ప్రేయసి ఇష్టాలను దృష్టిలో పెట్టుకుని రాయడం మరిచిపోవద్దు.