ప్రేయసి దగ్గర మీరు గొప్ప ప్రేమికుడుగా గుర్తించబడాలంటే ఆమె లోకంలో మీకంటే ప్రత్యేకమైన వారు లేరు అని ఆమె భావించేలా చేయండి. భవిష్యత్ గురించి ఆమె కంటున్న కలలు మీ సానిహిత్యంలోనే నెరవేరుతాయనే భరోసా కల్పించండి. అప్పుడు మీ ప్రేయసి మీ ప్రేమను తన ప్రాణం కన్నా మిన్నగా భావిస్తుంది.
దాంతో ఆమె జీవితంలో మీరు ఎవరెస్ట్ కన్నా ఉన్నతమైన స్థానాన్ని సంపాధిస్తారు. మీతోటి ఉండే జీవితం కన్నా మరేదైనా ఆమెకు వృధాగానే అన్పిస్తుంది. అంతటి గొప్ప భావం మీపై మీ ప్రేయసిలో కలగాలంటే మీరు కోరుకుంటోన్న మీ ప్రేయసి మదిలోని భావాల్ని కనిపెట్టండి. నిద్రపోతున్న ఆ భావాలను నిద్రలేపి వాటిని నెరవేర్చే మార్గం మీరే అన్న విషయమాన్ని ఆమెకు గుర్తు చేయండి.
అందుకు ఆమె అంతరంగంలోని భావాలను గ్రహించండి. ఆ భావాల సమాహారాన్ని ఓ అందమైన ఊహా ప్రపంచంగా ఆమెకు పరిచయం చేయండి. అయితే మీరు నిర్మించే ఊహా ప్రపంచం వాస్తవికతకు దగ్గరగా ఉండేలా చూడండి. ఎందుకంటే భవిష్యత్‌లో ఆమె వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టినా పెద్ద తేడా అన్నది కన్పించకుండా ఉంటుంది.
మీరు నిర్మించిన ఆ ఊహా ప్రపంచంలో వాస్తవిక అంశాలే కన్పిస్తున్నా అవన్నీ ఆమెకు అందమైన అద్భుతంగా అంతకుముందెప్పుడూ చూడని కొత్త లోకం అనిపించేలా చేయండి. ఆ ఊహా ప్రపంచంలో మీరు, ఆమె తప్ప మరెవరూ లేకుండా చూడండి. అక్కడ మీ ప్రేయసికి ఎలాంటి అవసరం ఉన్నా మీరు మాత్రమే తీర్చగలరనే భరోసా ఇవ్వండి.
అలా నిర్మించుకున్న మీ ఊహాలోకాన్ని కాలగమనంలో వాస్తవిక ప్రపంచానికి దగ్గరచేసే ప్రయత్నం చేయండి. అలా సాగించే మీ ప్రయత్నం చివరకు మీ ఊహా ప్రపంచానికి, వాస్తవిక ప్రపంచానికి మధ్య తేడా కనిపించనంతవరకు కొనసాగించండి. అలా కలల సౌధం నుంచి వాస్తవిక ప్రపంచాన్ని చేరుకున్న మీ ప్రేమ పయనంలో అప్పటికే మీ ప్రేయసి పూర్తి సంతోషాన్ని చవిచూసి ఉంటుంది. దాంతో భవిష్యత్‌లో ఆమె ప్రేమ ప్రపంచంలో ఎప్పటికీ మీరే హీరోగా మిగిలిపోతారు.