Test Footer 2

01:32
0

ఐలవ్యూ చెప్పేముందు... ఆలోచించండి




నేను నిన్ను ప్రేమిస్తున్నాను... ఐలవ్యూ అని చెప్పడం నేటికాలంలో ఓ ఫ్యాషన్ అయిపోయింది. కొన్నేళ్ల ముందు వరకు ఐలవ్యూ అనే మాట పెదవి దాటాలంటే ప్రేమికులు ఎంతగా సతమతమయ్యేవారో మనకు తెలియంది కాదు. కానీ ఆధునికత ఉరకలు వేస్తున్న ప్రస్తుత తరుణంలో మదిలోని మాటని చెప్పేందుకు యువత పెద్దగా సంకోచించడం లేదు.

అదేసమయంలో తమ మనసులో మొగ్గ తొడిగిన ప్రేమ విషయాన్ని తమ ఇష్టమైనవారి ఎదుట బయటపెట్టేందుకు సైతం వారు ఏమాత్రం భయపడడం లేదు. ఇది ఓ విధంగా ఓ మంచి పరిణామమే. ఎందుకంటే ప్రేమ అనే అంశాన్ని మదిలోనే దాచుకుని దాన్ని ఎదుటివారి ముందు చెప్పలేక జీవితాంతం సతమతమయ్యే బదులు మనసులోని మాటను నచ్చినవారికి చెప్పేసి మనసును తేలికచేసుకోవడం అభినందించాల్సిన విషయమే.

అయితే ఐలవ్యూ చెప్పడం తప్పుకాకపోయినా ఆమాట చెప్పాలనుకున్నప్పుడు మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే సినిమాల్లో చూపించినట్టు ఐలవ్యూ అని అమ్మాయి దగ్గర చెప్పడం హీరోయిజం కాదు. జీవితంలో తమకు నచ్చినవారిని జీవితాంతం తోడు తెచ్చుకునేందుకు ఉద్దేశించి చెప్పేదే ఐలవ్యూ అంటే. మరి అలాంటి మాటను చెప్పేముందు ఎంతగా ఆలోచించాలో మనకు తెలియంది కాదు.
మనకు ఒకరు నచ్చినపుడు వెంటనే ఐలవ్యూ అని చెప్పేయాలని ఆలోచించడం కాకుండా అసలు వారు మనకు ఎందుకు నచ్చారు, ఈ నచ్చడం అనేది ఏ స్థాయిలో నచ్చింది, ఎదుటివారిపై మనకు కలిగింది ఇష్టమా లేక ఆకర్షణా అనే విషయాల్ని ఓసారి సమిక్షించుకోవడం ఉత్తమం. అలా కాకుండా కేవలం ఏదో ఓ విషయంలో ఎదుటివారు నచ్చితే అంతమాత్రానికే ఆ ఇష్టానికి ప్రేమ అని పేరు పెట్టేయడం మూర్ఖత్వమే అవుతుంది.

అందుకే ఐలవ్యూ అని చెప్పేముందు ఓసారి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదా మనసుకు నచ్చినవారి గురించి కాస్త తెలిసే దాకా ఆగి ఆ తర్వాత మనసులోని నిర్ణయాన్ని చెప్పడం అన్నింటి కన్నా ఉత్తమమైన మార్గం. అలా ఎదుటివారి గురించి తెలుసుకునే సందర్భంలో అసలు మన గురించి వారి మనసులో ఏమనకుంటున్నారో కూడా తెలిసే అవకాశముంది. అలా మనమీద ఎదుటివారికి కూడా ఇష్టం ఉంది అనే విషయం ఖచ్చితంగా తెలిసినపుడు మీరు చెప్పే ఐలవ్యూకు వారు కూడా అదే మాటను తిరిగి చెప్పే అవకాశాలు మెండుగా ఉంటాయి.

అంతేకాకుండా అలా ఒకరి గురించి ఒకరికి ఓ మోస్తరుగా అర్థమైన తర్వాత మొదలయ్యే ప్రేమ ఆ తర్వాతి కాలంలో మరింత బలపడి జీవితాంతం వీడిపోని బంధంగా నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే ఐలవ్యూ అనే పదాన్ని ఏదో సరదాగా కాకుండా నిజంగా ఎదుటివారిమీద ఎనలేని ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే చెప్పేందుకు ఉపయోగించండి. అప్పుడే ఆ మాటకున్న విలువను మీరు కాపాడినవారవుతారు.