Test Footer 2

01:26
0

అమ్మాయిలను బుట్టలో పడవేసేందుకు శిక్షణ...




అమ్మాయిలను బుట్టలో వేసేందుకు అబ్బాయిలు ఎలా తంటాలు పడతారో సినిమాల్లో చూపిస్తుంటారు. ఏదో ఒక బురిడీ కొట్టి ఆమెను తనవైపుకు తిప్పుకోవడం... ఆ తర్వాత నిజం తెలిసిన అమ్మాయి అతడి చెంప ఛెళ్లుమనిపించడం... అటు పిమ్మట పశ్చాత్తాపంతో మథనపడటం, అబ్బాయి బాధ చూడలేక అతడి కౌగిలిలో కరిగిపోవడం.. ఓ డ్యూయెట్.. ఇదీ రావుగోపాలరావుగారు చెప్పిన సినీ లవ్ సంగతి.

అయితే నిజజీవితంలో అమ్మాయిలను ఎలా బుట్టలో వేయాలన్నదానిపై శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పాడో యువకుడు. వివాహ వేదికలంటూ పెళ్లి సంబంధాలను కుదిర్చేందుకు మాత్రం ఎన్నో కేంద్రాలుండటాన్ని తాను గమనించాననీ, కానీ డేటింగ్‌కు శిక్షణనిచ్చే కేంద్రాలను ఎక్కడా చూడలేదంటున్నారు లాస్ ఎంజెలిస్ నుంచి వచ్చిన ప్రవాస భారతీయుడు విక్కీ కల్వాని.

నచ్చిన అమ్మాయిని తన పట్టపు రాణిగా చేసుకునేందుకు అబ్బాయిలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో తనకు తెలుసునని అంటున్నాడు. అటువంటి అబ్బాయిలకోసం తను ఓ డేటింగ్ స్కిల్స్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పినట్లు చెప్పాడు. ప్రస్తుతానికి అబ్బాయిలకు మాత్రమే డేటింగ్ చిట్కాలు అందజేయడం జరుగుతోందన్నారు. నిజానికి ఇటువంటి కేంద్రాలు అమెరికాలో పలు చోట్ల దర్శనమిస్తాయని వెల్లడించారు.

ఈ శిక్షణలో కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను అబ్బాయిలకు చెప్పడం జరుగుతుంది. చాలామంది అబ్బాయిలు తమ మనసులోని భావాలను అమ్మాయిల వద్ద వ్యక్తీకరించడానికి భయపడుతుంటారు. ఇటువంటి భయాన్ని పోగొట్టడం ప్రధానమైన అంశం.

కనుక ఎవరైనా అమ్మాయి నచ్చినట్లయితే ముందు ప్రేమ విషయం పక్కన పెట్టి మరో విషయంతో సదరు అమ్మాయితో దగ్గరవ్వాలట. అమ్మాయితో స్నేహం ముదిరాక ఆమె చేస్తున్న ప్రయత్నాలను ప్రోత్సహిస్తూ, విజయం సాధించినప్పుడు పొగుడుతూ.. అలా అలా దారిలోకి తేవాలట. అయితే అప్పటికి కూడా వెంటనే ప్రేమ గురించి చెప్పకుండా మెల్లగా రొమాంటిక్ పుస్తకాలను బహూకరించడం మొదలెట్టాలట. ఆ పుస్తకాలను అమ్మాయి చదివిన పిమ్మట అభిప్రాయాలు అడగాలట. అలా ఆమెను ప్రేమలోకంలోకి తీసుకురావాలట.

ఇటువంటివి అనేక చిట్కాలను విక్కీ తను స్థాపించిన డేటింగ్ శిక్షణా కేంద్రంలో ఇస్తున్నాడు. ఈ కోచింగ్ దశలవారీగా ఉంటుంది. అయితే ఇది ఉచితం కాదండోయ్. ఓ వారం థియరీ క్లాసులకు రూ. 10 వేలు ఛార్జ్ చేస్తున్నాననీ, ప్రాక్టికల్స్‌కి రూ. 30 వేలు, పూర్తి డేటింగ్ కోర్సుకి రూ. 90వేలుగా నిర్ణయించినట్లు చెప్పాడు. ఖర్చు ఎక్కువే.. కానీ వలచిన పడతిని సొంతం చేసుకోవాలంటే తప్పదు మరి..!!