Test Footer 2

01:42
0

మాజీ ప్రేమికుల నుంచి అమ్మాయిలకు వేధింపులు.. వదిలించుకునేదెలా...?








విదేశాల్లో మామూలే అయినా... ఇండియాలో అమ్మాయిలకు ఇప్పుడిపుడే ఈ మాజీ ప్రేమికుల బెడద ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే మోసపోవడంలో భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలదే అగ్రస్థానం. ఏదో ఒక వలలో చిక్కి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు.

ప్రేమించినవాడు మంచివాడనుకుని మనసుతో పాటు అన్నీ అర్పించి చివరకు అయ్యో అనుకోవడం అమ్మాయిలకు మామూలే... చివరకు సంబంధాలు తెంచుకున్నా మాజీ ప్రేమికులు వెంటపడి వేధిస్తారు. అమ్మాయిల పరిస్థితి `ముల్లు - ఆకు'లా మారిపోతోంది. అందుకే మొదటినుంచీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.

సాధారణంగా ప్రస్తుత ప్రేమికుడు ప్రధానంగా 2 విధాలుగా మాజీ ప్రేమికులయ్యే అవకాశం ఉంది. అనుకున్న విధంగా అతనితో పెళ్ళి కాకపోవడం, ప్రేమికుని ప్రవర్తన వల్ల ఏర్పడే తీవ్ర మనస్పర్థలు కారణంగా మాజీ ప్రేమికుడనేవాడు ఉద్భవిస్తాడు. విడిపోయేవరకూ కొంతలో కొంత బాగానే ఉన్నా... ఆ తరువాత ఈ మాజీ ప్రేమికులకు ఓ విచిత్ర మనస్తత్వం ఏర్పడుతుంది.

అదేమంటే... మనకు దక్కని రామచిలుక మరొకరి పంజరంలోకి వెళ్లిపోవడాన్ని సహించకపోవడం. దీంతో ఒక విధమైన మానసిక వేదనకు గురై తమ మాజీ ప్రియురాలిని వేధించే ప్రయత్నాలను మొదలు పెడతారు. దీని వల్ల ఏమౌతుంది? ఈ ప్రియురాలికి పెళ్ళి అయిపోయి ఉంటే వైవాహిక జీవితం దెబ్బతింటుంది లేదా పెళ్ళి నిశ్చయమై ఉన్నట్లయితే సంబంధం చెడిపోతుంది. ఇవి రెండూ కాకుండా ఒకవేళ ఆ అమ్మాయి మరో మంచి ప్రియుడి చెంత చేరితే... ఈ కొత్త ప్రేమ కూడా కొనసాగదు.

ఈ వేధింపులు ఎలా ఉంటాయి ? అన్నది కదూ మీ క్వశ్చన్‌...

ఏముంది.. అతను, మీరు కలసి ముచ్చటపడి తీసుకున్న ఫొటోలు, ఇద్దరూ రాసుకున్న ఉత్తరాలు, మార్చుకున్న ఉంగరాలు, పంపుకున్న గిఫ్ట్‌లు.... ఇలా కాదేది వేధింపునకు అనర్హం అన్నట్లు... దేన్నైనా ఆయుధంగా వాడుకోవచ్చు. ఇవన్నీ బయటపెడతామంటూ బ్లాక్‌ మెయిలింగ్‌ జరుగుతుంది. విదేశాల్లో అయితే ఇవి కాక మరో డేంజరస్‌ వ్యవహారం కూడా ఉంది. అదేమంటే ఈ ప్రేమికుల ప్రేమలీలలే అందరికీ తెలిసి ఉంటాయి కానీ వీరు విడిపోయిన సంగతి అంత ఫాస్ట్‌గా ప్రచారం జరగదు. ఈలోగా ఆ మాజీ ప్రేమికుడుగారు తన మాజీ ప్రియురాలి పేరును వాడుకొని అప్పులు చేసేయడం లాంటి కేసులు అక్కడ ఎన్నో... ఇంకో విషయం ఏమంటే పాశ్చాత్య దేశాల్లోని అమ్మాయిలు తమ ప్రయివేటు ఫ్లాట్‌ తాళాలను తమ ప్రేమికులకు ఇస్తూ ఉంటారు. విడిపోయిన తరువాత కూడా ఈ తాళాలు ఆ మాజీల దగ్గర నుంచి అడిగి తీసుకోక ఇబ్బందుల్లో పడ్డ అమ్మాయిలెందరో...


మనల్ని ప్రేమించే వాడొకడున్నాడు కదా అని సంబరపడిపోయి ఓవర్‌ యాక్షన్‌ చేయడం ఇప్పటి జనరేషన్‌ అమ్మాయిలు చేస్తున్న ఓ పెద్ద పొరపాటు. ఈ పొరపాట్లే గ్రహపాట్లవుతున్నాయి. అమ్మాయిలు తమ ప్రేమను పెళ్ళికి మార్గంగా కాక సరదా కాలక్షేపంగా తీసుకోవడంతోనే అసలు తంటా వస్తోంది. ఎనీవే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.

ఫొటోలు : మీ ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యాలివి. ఎంత గాఢంగా ప్రేమిస్తున్న ప్రేమికుడితో అయినా సరే.... ఉత్సాహపడి ఫొటోలకు ఫోజులివ్వకండి. కావాలంటే మీ స్నేహితుల గ్రూప్‌ ఫొటోలో అతని పక్కనే నిలబడండి చాలు. ఒకవేళ తరువాత టైం బాగాలేక మీరు విడిపోవాల్సిన పరిస్థితులు వస్తే... ఈ ఫొటోలు మీకు ఇబ్బంది కల్గించవు.

ఫోన్‌ నెంబర్‌ : మీ ప్రేమికుడితో కమ్యూనికేషన్ వీలైనంత వరకూ టెలిఫోన్‌ బూత్‌ ద్వారా లేదా మీ స్నేహితురాలి ఫోను ద్వారా జరపడం మంచిది. తరువాత మీరు విడిపోయినా మీకు టెలిఫోను బ్లాక్‌ మెయిలింగ్‌ బెడద ఉండదు.

ఉత్తరాలు : ఫోటోల తరువాత దాదాపు అంతటి ఉపద్రవం కల్గించేవి ఉత్తరాలు. మీ ప్రేమికునికి రాసే ఉత్తరాల్లో వీలైనంత వరకూ సరదా సంగతులతో ఎక్కువగా పెళ్ళి గురించి, కుటుంబ విషయాలనే ప్రస్తావిస్తూ ఉండేలా జాగ్రత్త పడండి. సెక్స్ విషయాలు, మీ తిరుగుళ్ళ గురించి రాయకపోవడమే మంచిది. మీరు విడిపోయిన తరువాత ఇలాంటి ఉత్తరాలు ఒక వేళ మరెవరి ముందు బయటపడినా నిజాయితీతో కూడిన మీ ప్రేమను మెచ్చుకునే అవకాశాలే ఎక్కువ. అసలు ఉత్తరాలే రాసుకోకుండా కేవలం కబుర్లకే మీరు పరిమితమా... మరీ మంచిది.

బహుమతులు : తీపి గుర్తుగా ప్రియునికి మీ పర్సనల్‌ వస్తువులు ఇచ్చేకన్నా వీలైనంత వరకూ కొత్తగా ఏవైనా కొని ఇవ్వడమే బెటర్‌.

పెళ్ళి కావడానికి ముందు : మీ కాబోయే అత్తమామలకు, ముఖ్యంగా భర్తకు మీ పాత ప్రేమ గురించి వివరించడమే మంచిది. మరొకరి ద్వారా ఆ విషయం వారికి తెలిస్తే సంభవించే ప్రమాదం భయంకరమైంది. పిల్లలు పుట్టిన తరువాత మాజీ ప్రేమికుల వేధింపులు మొదలైతే ఇక జీవితానికి, నరకానికీ పెద్ద తేడా ఏమీ ఉండదు. అందువల్ల తస్మాత్‌ జాగ్రత్త. మీ ప్రేమికునితో పొరపాటున తీయించుకున్న ఫొటోలు, రాసుకున్న ఉత్తరాలు (అతను రాసినవి) కాల్చి పారేయడం మీ తక్షణ కర్తవ్యం.

ప్రేమ వైఫల్యం వేదనతో బాధపడే యువతులు ఆ అవస్థ నుంచి బయట పడాలంటే... వీలైనంత వరకూ దూరపు సంబంధాల వారిని పెళ్ళి చేసుకోవడం బెస్ట్. అంటే ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉండే కుటుంబాల వారితో పెళ్ళికి సిద్ధం కండి. దీని వల్ల వేధింపులకు దాదాపు దూరమైనట్లే. అమ్మాయిలూ... జాగ్రత్త పడతారు కదూ...