ప్రస్తుతం కుర్రాళ్ళకు ప్రేమించడం కూడా డిగ్రీలు సాధించినట్లే ఇది కూడా అర్హత అన్నట్లుగా మారింది. ఎక్కడ చూసినా ప్రేమ జంటలే కనబడుతున్నాయి. ఏ బీచ్‌కు వెళ్ళినా ప్రేమ జంటలు విహారం చేస్తున్నారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎక్కడ చుసీనా సెల్‌ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తుంటారు. వాళ్ళు ఎవరితో ఏమేమి మాట్లాడుతారో తెలియదు కాని... ఆ సెల్ పరధ్యానంతో ట్రాఫిక్‌ను కూడా పట్టించుకోకుండా నడిచేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ప్రమాదాలు సంభవించిన సంఘటనలు లేకపోలేదు.
మొత్తమ్మీద చదువుకునే వయసులో విద్యార్థులు ఈ ప్రేమ రోగంలో పడి వారి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. వారి గమ్యాన్ని మరచి, ప్రేమ పేరుతో సినిమాలు, పబ్‌లు, బీచ్‌లు వెంబడి తిరిగి విలువయిన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు.
ఇప్పుడు తాజాగా అమ్మాయిలు, అబ్బాయిలు రేవ్ పార్టీలనే కొత్త క్రీడలో మునిగి తేలుతున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను మరచి విదేశీ అలవాట్ల పట్ల మోజు పెంచుకుంటున్నారు. విదేశీ వస్త్రధారణ, సహజీవనం, మత్తు పానీయాలు, డ్రగ్స్ వంటి వాటికి అలవాటుపడి విచ్చలవిడి జీవితంలో గమ్యం లేకుండా భవిష్యత్తును కాలరాసుకుంటున్నారు.
ప్రేమ పేరుతో యువత డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. సెల్‌ఫోన్ బిల్లులు, సినిమాలు, బైక్‌లకు, ప్రేయసితో షికార్లు... ఇలా మంచినీళ్లలా పచ్చనోట్లను ఖర్చు చేసేస్తున్నారు. షాపింగ్‌లు, పబ్‌లకు వెళ్ళడాన్ని ఇప్పటి కల్చర్ అంటున్నారు. అభివృద్ది చెందుతున్న సమాజంతో పాటు యువత అభివృద్ధి చెందాల్సింది పోయి... కొత్త దురలవాట్లను కొనితెచ్చుకుని అధఃపాతాళానికి చేరుకుంటున్నారు. ఈ స్థితి నుంచి బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.